: ఏపీ ఎమ్మెల్యేలకూ తీపి కబురు!... అలవెన్సుల కింద నెలకు రూ.లక్ష మేర పెంపు
తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు భారీగా వేతనాల పెంపునకు కసరత్తు జరుగుతున్న దరిమిలా... పొరుగు రాష్ట్రం ఏపీలోనూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తీపి కబురు త్వరలోనే అందనుంది. వేతనమేమీ పెరగకున్నా అలవెన్సుల కింద ప్రస్తుతం అందుతున్న దానికి అదనంగా రూ.లక్ష మేర ప్రతి నెలా చేతికందనుంది. ఈ మేరకు నిన్న సమావేశమైన ఎమినిటీస్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. నిన్నటి సమావేశంలో రూపొందిన ప్రతిపాదనలకు వచ్చే వారం అసెంబ్లీలో ఆమోద ముద్ర వేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్యేల వేతనం నెలకు రూ.12 వేలుగా ఉంది. దీనిని ఏమాత్రం పెంచకుండానే కేవలం అలవెన్సులను పెంచాలని ఎమినిటీస్ కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం ఎమ్మెల్యేలకు అలవెన్సుల కింద నెలకు రూ.83 వేలు అందుతోంది. ఇకపై దీనికి అదనంగా మరో రూ.45 వేలను అందించేందుకు కమిటీ తీర్మానించింది. ఈ రూ.45 వేలతో పాటు అద్దె భత్యం కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.25 వేలను డబుల్ చేయనున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పుస్తక ముద్రణ తదితరాల కోసం రూ.30 వేలు అందనుంది. వెరసి ప్రస్తుతం అందుతున్న దానికి అదనంగా రూ.లక్ష మేర పెంపు ఉండేలా ఉన్న ప్రతిపాదనలకు కమిటీ ఆమోదం తెలిపింది. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండే ఎమ్మెల్యేలకు ఈ పెంపు రూ.75 వేలకే పరిమితం కానుంది. ఇక వాహన రుణాన్ని ప్రస్తుతమున్న రూ.15 లక్షల నుంచి ఒకేసారి రూ.40 లక్షలకు పెంచాలని కూడా ఎమినిటీస్ కమిటీ సిఫారసు చేసింది. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ రూ.15 వేలను రూ.30 వేలకు పెంచాలని సూచించింది.