: రెండు గంటల పాటు సుదీర్ఘ తీర్పు!... కీలక అంశాలను ప్రస్తావించిన డివిజన్ బెంచ్
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ ను సమర్థిస్తూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులోని డివిజన్ బెంచ్ ప్రకటించిన తీర్పు దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. నేటి ఉదయం కోర్టు ప్రొసీడింగ్స్ ప్రారంభం కాగానే ఉదయం 10:30 గంటల సమయంలో తీర్పును చదవడం ప్రారంభించిన డివిజన్ బెంచ్ 12:30 గంటలకు దానిని ముగించింది. ఈ సందర్భంగా కోర్డు పలు కీలక అంశాలను ప్రస్తావించింది. అసెంబ్లీలో నియమ నిబంధనలను తుంగలో తొక్కుతూ సభ్యులు చేసే వ్యాఖ్యలపై చర్యలు తీసుకునే సంపూర్ణ హక్కు సభకే ఉంటుందని చెప్పింది. అదే సమయంలో ఏదో చిన్న పొరపాటును ఆసరా చేసుకుని సస్పెన్షన్ వేటు పడ్డ సభ్యులు న్యాయస్థానాలను ఆశ్రయించినా ఫలితం ఉండబోదని కూడా బెంచ్ పేర్కొంది. ఈ సందర్భంగా హౌస్ రూల్స్ లోని సెక్షన్ 212ను ప్రస్తావించిన బెంచ్... చట్ట సభలు తీసుకునే నిర్ణయాలను న్యాయస్థానాలు ప్రశ్నించజాలవన్న విషయాన్ని కూడా విస్పష్టంగా పేర్కొంది. కేవలం సాంకేతిక అంశాలను కారణంగా చూపుతూ సభ్యులు చట్ట సభలు తీసుకునే చర్యల నుంచి తప్పించుకోలేరని కూడా తెలిపింది.