: రోజాకు చుక్కెదురు!.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేసిన హైకోర్ట్ డివిజన్ బెంచ్
చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో చుక్కెదురైంది. రోజాపై ఏడాది పాటు విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొద్దిసేపటి క్రితం కొట్టేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి చేసిన వాదనను డివిజన్ బెంచ్ సమర్ధించింది. రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ విధిస్తూ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు చెల్లదని కూడా డివిజన్ బెంచ్ విస్పష్టంగా తేల్చిచెప్పింది. నిండు సభలో సీఎం నారా చంద్రబాబునాయుడు, స్పీకర్ కోడెల శివప్రసాద్ లపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. అయితే సస్పెన్షన్ తీర్మానంలో సభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రస్తావించిన సెక్షన్ ను ఆసరా చేసుకుని రోజా న్యాయ పోరాటం చేశారు. ఈ క్రమంలోనే సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలతో తక్షణ విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్... రోజా వాదనను సమర్థించింది. సస్పెన్షన్ చెల్లదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ అప్పీలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నిన్న ఇరువర్గాల న్యాయవాదుల వాదనలు విన్న డివిజన్ బెంచ్ రోజాకు వ్యతిరేకంగా సంచలన తీర్పు వెలువరించింది.