: రోజా సస్పెన్షన్ పైన, వైఎస్సార్సీపీ నేతలపైన స్పీకర్ ఏమన్నారంటే...!
ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యేందుకు రోజాకు మరో అవకాశం ఇవ్వాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సూచించారు. దీనిపై స్పీకర్ మాట్లాడుతూ, జరిగిన ఘటనపై రోజా క్షమాపణలు కోరినట్టయితే బాగుండేదని అన్నారు. అలా కాకుండా రోజా యుద్ధ మార్గాన్ని ఎంచుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే రోజాపై సస్పెన్షన్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆమెకు ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యేందుకు మరో అవకాశం ఇచ్చినట్టు ఆయన తెలిపారు. అంతవరకు సస్పెన్షన్ కొనసాగుతుందని, కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. అలాగే శాసనసభ వ్యవహారాలపై అనుచిత కథనం ప్రసారం చేసినందుకు 'సాక్షి' టీవీ చానెల్ కి నోటీసులు జారీ చేశామని ఆయన చెప్పారు. వాటిపై స్పందించిన సాక్షి క్షమాపణలు చెప్పిందని ఆయన తెలిపారు. ప్రివిలేజ్ కమిటీ విచారణ సందర్భంగా కోటంరెడ్డి, జ్యోతుల, చెవిరెడ్డిల వివరణతో కమిటీ సంతృప్తి చెందిందని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్పీకర్ చెప్పారు. కొడాలి నాని, రోజాపై చర్యలను రోజాపై ప్రివిలేజ్ కమిటీ విచారణ వరకు వాయిదా వేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ చర్చలో ప్రతిపక్షం పాల్గొని ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే స్పీకర్ అధికారాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని ఆయన చెప్పారు.