: లాతూరులో నీటి యుద్ధాలు... రంగంలోకి దిగిన పోలీసులు!


లాతూరు... దాదాపు 5 లక్షల మంది జనాభా ఉన్న మహారాష్ట్రలోని పట్టణం. ఇప్పుడు అక్కడ ఎలాంటి నీటి కొరత ఉందంటే, బిందె నీరు కోసం ఒకరితో ఒకరు కొట్లాటలు, గొడవలకు దిగాల్సిన పరిస్థితి. రోజుకు 2 కోట్ల లీటర్ల నీరు అవసరమైన పట్టణంలో నెలకోసారి మాత్రమే ఆ నీరు లభిస్తోంది. లాతూరు మునిసిపల్ అధికారులు నడుపుతున్న నీటి ట్యాంకర్ల వద్ద జరుగుతున్న కొట్లాటలతో, అక్కడ ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించడంతో పాటు, సెక్షన్ 144ను అమలు చేస్తున్నారు. ఇక్కడి ఆరు వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ల వద్ద పెద్దఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలోని రిజర్వాయర్లలో నీరు నిండుకోవడంతో, ఉన్న నీటిని కాపాడుకునేందుకు చిన్న చిన్న మరపడవల్లో సాయుధులతో కాపలా కాయిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తీవ్ర వర్షాభావమే ఇందుకు కారణమని తెలుస్తోంది. నీటి సరఫరాను మెరుగుపరిచేందుకు అన్ని రకాల చర్యలనూ తీసుకుంటున్నామని అధికారులు అంటున్నప్పటికీ, చుక్క నీటిని కూడా అందివ్వడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఏప్రిల్ 1 వరకూ 144 సెక్షన్ కొనసాగిస్తామని, ఆపై పరిస్థితిని బట్టి పొడిగించే నిర్ణయం తీసుకుంటామని లాతూరు జిల్లా కలెక్టర్ పాండురంగ్ పూలే వెల్లడించారు. పట్టణానికి నీటిని అందించే అర్వి, డొంగార్ గాం, మాల్కొంజీ రిజర్వాయర్లతో పాటు మంజీరా డ్యామ్ లు పూర్తిగా ఎండిపోయాయని వివరించారు.

  • Loading...

More Telugu News