: అర్ధ శతాబ్దపు 'కోల్డ్ వార్'కు ముగింపు చెబుతూ, క్యూబా గడ్డపై అమెరికా అధ్యక్షుడు
"క్యూయ్ బోలా క్యూబా?" అంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన క్యూబా పర్యటనను ప్రారంభించారు. దాదాపు అర్ధ శతాబ్దానికి పైగా సాగిన కోల్డ్ వార్ కు ముగింపు పలుకుతూ, అధ్యక్షుడిని తీసుకువచ్చిన ఎయిర్ ఫోర్స్ వన్ హవానా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కాగా, ఆ వెంటనే స్థానిక భాషలో ఒబామా ప్రజలను ఎలా ఉన్నారని (క్యూయ్ బోలా క్యూబా?) పలకరిస్తూ ట్వీట్ చేశారు. ఆయనతో పాటు భార్య మిచెల్, కుమార్తెలు సాషా, మాలియాలు సైతం క్యూబాలో కాలుమోపారు. ఆ సమయంలో వర్షం పడుతుండటంతో విమానం దిగుతూనే గొడుగులు బయటకు తీయడం కనిపించింది. ఫిడేల్ క్యాస్ట్రో నేతృత్వంలోని గెరిల్లా దళాలు, 1959లో దేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్న తరువాత ఏ అమెరికా అధ్యక్షుడూ క్యూబాలో పర్యటించలేదన్న సంగతి తెలిసిందే. "1928లో అధ్యక్షుడు కాల్విన్ కులిడ్జ్ ఓ యుద్ధ నౌకపై ఇక్కడికి వచ్చారు. అందుకాయనకు మూడు రోజుల సమయం పట్టింది. నేను మూడు గంటల్లో వచ్చాను. ఈ పర్యటన చారిత్రాత్మకం" అని ఒబామా వ్యాఖ్యానించారు. కాగా, నేడు క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోతో ఒబామా సమావేశం కానున్నారు.