: మూడు రోజుల్లో 45 మంది... పిల్లలకు వాహనమిచ్చే పెద్దలూ జైలుకే
లైసెన్స్ లు లేకుండా పట్టుబడి జైలుకు వెళుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గడచిన మూడు రోజుల్లో ఒక రోజు నుంచి వారం రోజుల వరకూ శిక్షపడిన వారి సంఖ్య 45గా ఉండగా, చంచల్ గూడా జైల్లో వీరి కోసం ప్రత్యేక బ్యారక్ ను సిద్ధం చేశారు. వీరిని ఇతర నేరస్తులతో కలపకుండా చూడాలన్న ఆదేశాల మేరకు జైలు అధికారులు ప్రత్యేక దుస్తులను, బ్యారక్ ను రెడీ చేసి అందులో వీరిని ఉంచుతున్నారు. లైసెన్స్ లేకుండా తనది కాని వాహనంతో ఎవరైనా పట్టుబడితే, వాహన యజమానిని సైతం గుర్తించి కోర్టుకు హాజరు పరచాలని, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనా కేసుల కోసమే ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. పిల్లలకు వాహనాన్ని ఇచ్చి పంపితే, వారికి బదులుగా, కుటుంబ యజమానిని జైలుకు పంపాలని కోర్టు నిర్ణయించింది. కాగా, మూడుసార్లు పట్టుబడిన వారిపై పోలీసులు కేసులను పెట్టి న్యాయస్థానం ముందు హాజరు పరుస్తుండగా, వారికి జరిమానాల బదులు జైలు శిక్షలే పడుతున్నాయి. ఇద్దరు రైతులు లైసెన్స్ లు లేని డ్రైవర్లతో మూడుసార్లు పట్టుబడగా, వారికి 15 రోజుల శిక్ష పడింది. కాగా, జైలుకు వెళితే, భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, వారికి పాస్ పోర్టులు రావని, ప్రభుత్వ ఉద్యోగాలు దూరమవుతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.