: హరీశ్ లేకుంటే ఏమై ఉండేది?... టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ క్లాస్!
తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ నేతలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన వరంగల్ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో గెలవలేకపోవడానికి పార్టీ నేతలే కారణమంటూ, వారికి క్లాస్ పీకారు. సొంత అభ్యర్థులను ఓడించేందుకు ఖర్చు పెట్టించారని ఆగ్రహించారు. 58 డివిజన్లలో కనీసం 50కి పైగా గెలిచే అవకాశాలు ఉండగా, 44 చోట్లే విజయం సాధించడం ఏంటని ప్రశ్నించారు. ప్రతి డివిజన్ లో రెబల్స్ బరిలోకి దిగారని గుర్తు చేసిన ఆయన, వీరిని బుజ్జగించడంలో ఘోరంగా విఫలమయ్యారని అసంతృప్తిని వ్యక్తం చేశారు. హరీశ్ రావు లేకుంటే ఫలితాలు ఇంకా ఘోరంగా ఉండేవని, ఆయన బాధ్యతలు తీసుకోబట్టే పరువు దక్కిందని అన్నారు. ఓ నేతను కాదని వేరే వారికి టికెట్ ఇచ్చినంత మాత్రాన, పార్టీ నిలిపిన వారు ఓడిపోవాలని కోరుకుంటారా? అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి పార్టీకి ప్రమాదకరమని, ఇలా జరిగితే కఠిన చర్యలు ఉంటాయని కేసీఆర్ హెచ్చరించినట్టు సమాచారం.