: అమెరికా పేద దేశం...ఇప్పుడు తెలివైన వాళ్లు కావాలి: ట్రంప్ కొత్త వ్యాఖ్యలు
తన వివాదాస్పద వ్యాఖ్యలతో విద్వేషాలు రేపే రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ మాటతీరు మారినట్టు కనబడుతోంది. తొలిదశ ప్రైమరీ ఎన్నికల్లో ఆయన వాగ్ధాటి, దూకుడైన మాటలతో విశేషంగా అభిమానులను సంపాదించుకున్నారు. తరువాతి క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఆయన అధ్యక్ష అభ్యర్థిత్వానికి అడ్డుగా నిలుస్తున్న తరుణంలో గొంతు మార్చారు. అమెరికా పేద దేశమని అన్నారు. చైనా, దుబాయ్ వంటి దేశాలతో పోల్చుకుంటే అమెరికా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న దేశంలా అనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ దేశాల్లో రోడ్లు, రైలు సౌకర్యాలు చూస్తే అమెరికా ఎంతో వెనకబడిందని తెలుస్తుందని అన్నారు. ఆయా దేశాల్లో బుల్లెట్ రైళ్లు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుండగా, అమెరికా ఆ స్థాయిని అందుకోలేదని చెప్పారు. ఇది మారాలంటే అమెరికాకు తెలివైన దేశాధినేతలు కావాలని అన్నారు. చురుగ్గా, వేగంగా నిర్ణయాలు తీసుకుని తెలివిగా వ్యాపారం చేయగల వ్యక్తులు దేశాధినేత కావాలని ఆయన పేర్కొన్నారు.