: విదేశీ అతిథులు ఉంటారు...ఇబ్బంది రాకూడదు కదా?: పవన్ కల్యాణ్
'సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో వేడుకను హైదరాబాదులోని నోవాటెల్ హోటల్ లో నిర్వహించనున్నామని ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ చెప్పారు. బాలీవుడ్ లో ఈ సినిమాను విడుదల చేస్తున్న ఈరోస్ సంస్థ ఈ ఆడియో వేడుకను నిర్వహిస్తోందని ఆయన చెప్పారు. ఈ హోటల్ లో విదేశీ అతిథులు పెద్దఎత్తున బసచేస్తారని ఆయన తెలిపారు. వారికి ఇబ్బంది కలగ కూడదని పోలీసులు సూచించారని ఆయన చెప్పారు. అదే సమయంలో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే అది అంతర్జాతీయ సమస్య అవుతుందన్న ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు పలు సూచనలు చేశారని ఆయన పేర్కొన్నారు. అందుకే ఆడియో వేడుకకు అదనపు భద్రతను కల్పిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి సమయంలో అభిమానులు భారీ సంఖ్యలో హాజరైతే, అతిథులు, అభిమానులు ఇబ్బందిపడే అవకాశం ఉందని అందుకే కేవలం పాసులు కలిగినవారు మాత్రమే ఈ ఆడియో వేడుకకు హాజరుకావాలని ఆయన సూచించారు. పరిస్థితిని అభిమానులు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.