: 2.6 కోట్ల రూపాయల ఉంగరం చెత్తబుట్టలో ప్రత్యక్షం!
విలువైన వస్తువు పోతే...ఆ బాధను వర్ణించడానికి మాటలు చాలవు. అలాంటిది కోట్ల విలువచేసే డైమండ్ రింగ్ పోతే? అలాంటి ఘటన అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ లో జరిగింది. బెర్నీ స్క్వేర్స్ అనే వ్యక్తి తన భార్య కార్లాకు వివాహ సమయంలో 4 లక్షల డాలర్ల (భారత కరెన్సీలో సుమారు 2.6 కోట్ల రూపాయలు) విలువ చేసే 12.6 క్యారెట్ల వజ్రపుటుంగరాన్ని కానుకగా ఇచ్చాడు. ఇటీవల ఓ రోజు ఈ ఉంగరాన్ని వంటింట్లో పేపర్ టవల్ లో చుట్టిన కార్లా, పనిలో పడిపోయి దాని గురించి మర్చిపోయింది. ఆ తర్వాత అది గుర్తుకు రావడంతో ఇల్లంతా వెతికింది. అయినా దొరకలేదు. ఇంతలో వారింట్లో ఉన్న బంధువు దానిని పేపర్ టవల్ లో వంటిట్లో చూసినట్టు చెప్పడంతో కార్లాకు అప్పుడు అసలు విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే భర్తకు విషయం వివరించింది. ఆ పేపర్ టవల్ ను చెత్తబుట్టలో వేసేశానని, ఆ చెత్తను ట్రక్కులు తీసుకెళ్లిపోయాయని చెప్పింది. దీంతో బెర్నీ ఆ ప్రాంతంలో చెత్త సేకరించే సంస్థను సంప్రదించాడు. అక్కడి అధికారులు సానుకూలంగా స్పందించి, చెత్త పారేసేందుకు వెళ్తున్న ట్రక్కులను వెనక్కి రప్పించారు. దీంతో కార్లా సహా పలువురు ఆ చెత్తను జల్లెడపట్టి, చివరకు ఉంగరాన్ని పట్టేశారు. దీంతో ఇదో అద్భుతమంటూ కార్లా ఆనందబాష్పాలు రాల్చింది.