: దమ్ముంటే... గన్ మెన్లు లేకుండా ఓయూకు రండి!: టీఎస్ మంత్రులకు కాంగ్రెస్ ఎమ్మెల్యే సవాల్
టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కమార్ నిన్న తెలంగాణ మంత్రులకు ఓ సరికొత్త సవాల్ విసిరారు. దమ్ముంటే... గన్ మెన్లు లేకుండా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రావాలన్న ఆయన సవాల్ ను టీఎస్ మంత్రులు స్వీకరిస్తారో, లేదో తెలియదు కాని, ఆయన సవాల్ మాత్రం కలకలం రేపుతోంది. నిన్న అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన సందర్భంగా ఆయన కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరిగారు. ఉద్యోగ నియామకాలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోతోందని ఆయన ఆరోపించారు. ఉద్యమ సమయంలోనే కాకుండా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను.. అధికార పీఠం అందగానే టీఆర్ఎస్ పార్టీ మరచిపోయిందని ధ్వజమెత్తారు. ఉద్యోగ నియామకాలపై సీఎం కేసీఆర్ ఓ మాట చెబుతుంటే, మంత్రులు మాత్రం మరో మాట మాట్లాడుతూ విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్నారని సంపత్ కుమార్ విరుచుకుపడ్డారు.