: జగన్ అక్రమాస్తుల కేసులో శ్రీని ప్రమేయం లేదు!... సీబీఐ కేసును కొట్టేసిన హైకోర్టు


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి నిన్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి షాకిచ్చింది. ఈ కేసులో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్.శ్రీనివాసన్ కు కూడా ప్రమేయం ఉందంటూ సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే సీబీఐ ఆరోపణలు అవాస్తవమంటూ సదరు కేసును కొట్టేయాలని శ్రీని... తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను నిన్న హైకోర్టు జడ్జి జస్టిస్ బి.శివశంకరరావు విచారించారు. శ్రీని తరఫున ప్రముఖ న్యాయవాది టి.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇండియా సిమెంట్స్ కు సున్నపురాయి గనులు, అదనపు నీటిని అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అక్రమంగా కేటాయించిందన్న ఆరోపణలు ఎలా ఉన్నా... అవన్నీ కంపెనీ పేరిట మాత్రమే జరిగాయని ఆయన వాదించారు. ఈ విషయంలో వ్యక్తిగతంగా శ్రీనికి ఎలాంటి ప్రమేయం లేదని కూడా ఆయన కోర్టుకు విన్నవించారు. నిరంజన్ రెడ్డి వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి... శ్రీని ప్రమేయం లేదని తేల్చేశారు. దీంతో శ్రీనిపై సీబీఐ దాఖలు చేసిన కేసును జడ్జి కొట్టేశారు.

  • Loading...

More Telugu News