: తీరు మార్చుకోవాల్సిందే!... టీడీపీ సీనియర్లకు పాఠాలు చెప్పిస్తున్న నారా లోకేశ్
ఏపీ అసెంబ్లీలో నిత్యం అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఈ వాగ్వాదం... వాగ్యుద్ధంగానూ మారుతోంది. పరుష పదజాలంతో కూడిన దూషణలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు, జబ్బలు చరుచుకోవడం, తొడలు కొట్టడం దాకా పరిస్థితి వెళుతోంది. ఈ వాగ్యుద్ధాల్లో టీడీపీ సీనియర్లు కూడా భాగస్వాములవుతున్నారు. దీనిపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దృష్టి సారించారు. సభలో సభ్యుల ప్రవర్తనతో పార్టీ ప్రతిష్ఠ మంటగలవకుండా ఉండేందుకు ఆయన ఓ మంచి మార్గాన్ని ఎంచుకున్నారు. తెలుగు వర్సిటీ, సెంట్రల్ వర్సిటీల ఆచార్యులు, సబ్జెక్ట్ నిపుణులతో... పార్టీ నేతలకు పాఠాలు చెప్పించేందుకు నారా లోకేశ్ నిర్ణయించారు. ఇందులో భాగంగా నిన్న అసెంబ్లీ వాయిదా పడగానే ఎంపిక చేసిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రొఫెసర్ల చేత పాఠాలు చెప్పించారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడే తీరు, హావభావాలు, ఉచ్చారణ మార్చుకోవాలంటూ ప్రొఫెసర్లు ఆ నేతలకు బోధించారట. సభలో కొన్ని సందర్భాలను ఉదహరిస్తూ... ఆయా సందర్భాల్లో సభ్యులు చేసిన తప్పులు, సదరు సందర్భాల్లో వ్యవహరించాల్సిన తీరుపై వారికి పాఠాలు చెప్పారు.