: మాఫియా డాన్ ఆరోగ్యం విషమం!... కిడ్నీలు ఫెయిల్, తక్షణమే డయాలసిస్ అవసరమట!


మూడు దశాబ్దాల పాటు పోలీసులను మూడు చెరువుల నీళ్లు తాగించిన మాఫియా డాన్ చోటా రాజన్ అలియాస్ రాజేంద్ర సదాశివ్ నికల్జే ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. బాలిలో ఇండోనేసియా పోలీసుల చేతికి చిక్కిన చోటా రాజన్ ను సీబీఐ అధికారులు దేశానికి రప్పించగలిగారు. ఆ తర్వాత అప్పటికే అతడిపై నమోదైన కేసుల విచారణ ప్రారంభం కాగా, ప్రస్తుతం అతడు ఢిల్లీలోని తీహార్ జైల్లో కాలం వెళ్లదీస్తున్నాడు. అరెస్టయ్యే నాటికే పలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న చోటా రాజన్... జైల్లో అడుగుపెట్టిన నాటి నుంచి మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. డయాబెటీస్ తో పాటు గుండె జబ్బులతో ఇబ్బంది పడుతున్న అతడి మూత్రపిండాలు రెండూ చెడిపోయాయి. తక్షణమే డయాలసిస్ చేస్తే తప్పించి అతడి ప్రాణాలు నిలిచేలా లేవు. అయితే తీహార్ జైల్లో అందుబాటులో ఉన్న వైద్య సౌకర్యాలు అతడికి ఉపశమనం కల్పించడం లేదు. దీంతో అతడిని ఢిల్లీలోని ఓ మెరుగైన ఆసుపత్రిలో చికిత్స చేయిస్తామంటూ జైలు అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 15ననే పోలీసులు దాఖలు చేసిన సదరు పిటిషన్ పై ఈ నెల 30న విచారణ జరగనుంది. ఈ మేరకు తీహార్ జైలుకు చెందిన విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ‘మెయిల్ టుడే’ ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.

  • Loading...

More Telugu News