: దాయాదుల పోరు నేడే!... ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, పాక్ మ్యాచ్
ఐసీసీ టీ20 మెగా టోర్నీలో నేడు భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. దాయాదుల పోరుగా పేరుగాంచిన ఈ మ్యాచ్ కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో నేటి రాత్రి జరగనుంది. ఇరు దేశాల క్రికెట్ అభిమానులే కాక యావత్తు ప్రపంచంలోని క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ ఈ టోర్నీకే హైలైట్ గా నిలవనుంది. మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు ఇప్పటికే అమ్ముడుబోయాయి. టికెట్లన్నీ ఆన్ లైన్ లోనే అమ్ముడుబోగా, ఆశ వదులుకోని అభిమానులు చిన్న అవకాశమైనా దొరకకపోతుందా? అంటూ ఈడెన్ గార్డెన్స్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే రెండు జట్లూ ఓ మ్యాచ్ చొప్పున ఆడగా... విజయంతో పాక్... గ్రూప్ బీ టాప్ 2 పొజిషన్ లో ఉంది. ఇక ఆడిన ఒక్క మ్యాచ్ లో పరాజయం చవిచూసిన ధోనీ సేన పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్ లో గెలిస్తేనే భారత్ కు ఫైనల్ అవకాశాలుంటాయన్న వాదన వినిపిస్తోంది. ఇదే అంశాన్ని ప్రస్తావించిన పాక్ కెప్టెన్ షాహిద్ అఫ్రీదీ... ఒత్తిడంతా భారత్ పైనేనని ప్రకటించాడు.