: 294 స్థానాల్లోనూ నేనే అభ్యర్థిననుకొని ఓటు వేయండి: మమతా బెనర్జీ
పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రచార జోరును పెంచారు. అక్కడి జల్‌పయిగురిలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో ఆమె శుక్రవారం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 294 స్థానాలలోనూ తానే అభ్యర్థిననుకోవాలని అన్నారు. తనను చూసే ప్రజలు ఓటు వేయాలని కోరారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గమనించాలన్నారు. ప్రజా సేవను బాధ్యతగా స్వీకరిస్తూ, ప్రజలకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తానని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకూ ఉత్తర బెంగాల్ కు వందసార్లు వచ్చానని దీదీ ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వం ఏ పార్టీకి చెందిన వారినైనా సమంగానే చూస్తుందని, ఎనిమిది కోట్ల మంది ప్రజలకు రెండు రూపాయలకే కిలో బియ్యం అందిస్తోందని అన్నారు. నార్త్ బెంగాల్ ప్రధాన కేంద్రంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోందంటూ తృణమూల్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఆమె గుర్తుచేశారు. పశ్చిమ బెంగాల్‌లో ఆరు దశల్లో ఏప్రిల్ 4, 11(మొదటి దశ), 17, 21, 25, 30, మే 5 తేదీల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.