: టీ-హబ్ రెండోదశకు రూ.100 కోట్లు సాయమడిగాను: మంత్రి కేటీఆర్


తెలంగాణలో టీ-హబ్ రెండోదశకు సాయం చేయాలని, రూ.100 కోట్లు ఇవ్వాలని కేంద్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ని కోరినట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్, కేంద్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ని ఈరోజు కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో త్వరలో ప్రారంభించనున్న ఐటీ పాలసీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని ఆయన్ని ఆహ్వానించినట్లు చెప్పారు. టీ హబ్ కు ఆర్థిక సాయం, ఈ-సిటీ అంశాలపై చర్చించినట్లు చెప్పారు. టీ -హబ్ కు సంబంధించి మొదటి దశ విజయవంతంగా నడుస్తోందని, రెండో దశకైనా కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని, రూ.100 కోట్లు ఇవ్వాలని మంత్రిని కోరినట్లు చెప్పారు. మూడు వేల కోట్ల రూపాయలు ఐటీఐఆర్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కు సంబంధించి ఇవ్వాల్సిందిగా మంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు. అనంతరం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుని కలిసినట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ అభివృద్ధికి నిధులు, స్మార్ట్ సిటీ, అవుటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) అంశాలపై చర్చించామన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను ఇప్పటివరకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుని కలుసుకోలేదని, ఆయనను కూడా కలిశానని చెప్పారు. కరీంనగర్ కు స్మార్ట్ సిటీ అవకాశం కల్పించాలని కోరినట్లు చెప్పారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కూడా కలిశామని, తెలంగాణాలో శాసనసభా స్థానాల పెంపు, హైకోర్టు విభజన, పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాల గురించి విన్నవించామన్నారు. అలాగే, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కూడా కలిశానని, హైదరాబాద్ ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు సంబంధించి, గతంలో జైకా వద్ద తాము లోన్ తీసుకున్నామని, దానికి సంబంధించిన ‘టర్మ్’ ఈ నెలాఖరుతో పూర్తవుతుందని అన్నారు. దానికి సంబంధించి రూ.833 కోట్లు సేవింగ్స్ ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా జైకాకు తమ రాష్ట్రం తరపు నుంచి సానుకూలంగా ఒక లేఖ ఇవ్వాల్సి ఉంటుందని, ఈ విషయమై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి విన్నవించామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని కేటీఆర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News