: ఆసీస్ కు షాకిచ్చిన అండర్ డాగ్... న్యూజిలాండ్ ఖాతాలో మరో విజయం!


అండర్ డాగ్ గా టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఆరంభించిన న్యూజిలాండ్ జట్టు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో కివీస్ అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించి విజయం సాధించింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు గుప్తిల్ (39), విలియమ్సన్ (24), మున్రో (23), ఇలియట్ (27) రాణించడంతో ఎనిమిది వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. అనంతరం 143 పరుగుల విజయ లక్ష్యంతో ఆసీస్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లు ఖ్వాజా (38), వాట్సన్ (13) ఆకట్టుకున్నారు. అయితే భారీ స్కోరు సాధించడంలో వారు తడబడ్డారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ స్మిత్ (6), వైస్ కెప్టెన్ వార్నర్ (6) విఫలం కావడంతో ఆసీస్ కష్టాల్లో పడింది. అనంతరం ఎన్నో ఆశలతో క్రీజులోకి వచ్చిన మ్యాక్స్ వెల్ (22) ఆకట్టుకుంటున్న దశలో పెవిలియన్ చేరాడు. దీంతో ఆసీస్ పై ఒత్తిడితో పాటు రన్ రేట్ కూడా పెరిగింది. ఈ క్రమంలో అస్గర్ (8) విఫలమైనా, మిచెల్ మార్స్ (22) భారీ షాట్లతో ఆకట్టుకున్నాడు. మార్ష్ ను మెక్ క్లెంగన్ అవుట్ చేయడంతో ఆసీస్ ఇక కోలుకోలేకపోయింది. చివరి ఓవర్లో ఫల్కనర్ (2), నెయిల్ (1), నెవిల్లి (7) భారీ షాట్లకు ప్రయత్నించినప్పటికీ విఫలం కావడంతో ఆసీస్ 8 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కివీస్ బౌలర్లలో మెక్ క్లెంగన్ మూడు వికెట్లతో రాణించగా, ఆండర్ సన్, శాంటనర్ చెరో రెండు వికెట్లు తీసి ఆసీస్ పతనం శాసించగా, వారికి ఒక వికెట్ తో సోడీ చక్కని సహకారమందించాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు భారత్, ఆస్ట్రేలియాలపై విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.

  • Loading...

More Telugu News