: కళాభవన్ మణి మృతి కేసు... టాక్సికాలజీ పరీక్షలో బయటపడ్డ క్రిమి సంహారకాలు!
'జెమిని' సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన మలయాళ నటుడు కళాభవన్ మణి(45) ఈనెల 6న కొచ్చిలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే, ఆయనది అనుమానాస్పద మృతి కావడంతో దీనిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో నిర్వహించిన శవపరీక్షలో పలు విషయాలు బయటపడ్డాయి. కళాభవన్ మణి శరీరంలో ఇన్సెక్టిసైడ్స్ (క్రిమి సంహారకాలు), ఇథనాల్, మిథనాల్ వంటి రసాయనాలు ఉన్నట్లు టాక్సికాలజీ పరీక్షల్లో తేలింది. శరీరానికి తీవ్రంగా హానికలిగించే ఇన్సెక్టిసైడ్ "క్లోర్పిరిఫోస్" సైతం కళాభవన్ మణి శరీరంలో ఉన్నట్లు పరీక్షలో బయటపడింది. "క్లోర్పిరిఫోస్"ను పంటపొలాల్లో పురుగుల నివారణకు ఉపయోగిస్తారు. దీనిపై పోలీసులు ఇప్పటికే కళాభవన్‌ది అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మణి కాలేయ సంబంధ వ్యాధితో కూడా బాధపడుతున్నట్లు భావిస్తున్నారు. ఇక అతని మరణంపై పలు అనుమానాలున్నాయంటూ ఆయన భార్య కూడా ఫిర్యాదు చేసింది. అయితే, కుటుంబ పరంగా ఎటువంటి సమస్యలూ లేవని ఆమె స్పష్టం చేసింది. తన భర్తకూ, తనకు మధ్య విభేదాలు లేవని తెలిపింది. తన భర్తకు ఎవరైనా శత్రువులున్నారా? అంటూ వేసిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. మణికి తన స్నేహితులతో కలిసి మందు తాగే అలవాటు ఉందని చెప్పింది. అయితే, తన భర్త బలవన్మరణానికి మాత్రం పాల్పడలేదని, ఆర్థిక సమస్యలు ఏవీ లేనప్పుడు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఎందుకుంటుందని ఆమె ప్రశ్నించింది. ఓ డ్రామా గ్రూప్‌లో చేరి మిమిక్రి కళాకారుడిగా పేరు తెచ్చుకున్న కళాభవన్ మణి అనంతరం మలయాళ సినిమా 'అక్షరం'లో ఆటోడ్రైవర్ పాత్రతో సినీ రంగ ప్రవేశం చేశారు. అనతి కాలంలోనే విలక్షణ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. నటనలో రాణిస్తూ 2000వ సంత్సరంలో నేషనల్, స్టేట్ స్పెషల్ జ్యూరీ అవార్డులు అందుకున్నారు. అనంతరం పలు తమిళ సినిమాల్లో ఆయన వేసిన ప్రతినాయకుడి పాత్రలకు మంచి గుర్తింపు లభించింది.