: గ్రూప్-2లో పోస్టుల సంఖ్య పెంచాలి: నిరుద్యోగ జేఏసీ డిమాండ్
టీఎస్పీఎస్సీలో గ్రూప్-2 పోస్టుల సంఖ్య పెంచాలంటూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ, ఓయూ జేఏసీ డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో హైదరాబాదులో ‘చలో అసెంబ్లీ’కి పిలుపు నిచ్చాయి. ఈరోజు మధ్యాహ్నం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని ఆర్ట్స్ కళాశాల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు, పోలీసుల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగాయి. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులపై విద్యార్థులు రాళ్లు రువ్వారు. దీంతో, పరిస్థితులను అదుపు చేసేందుకుగాను విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. దీంతో, ఉస్మానియా యూనివర్శిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాగా, గ్రూప్-2 ఎంట్రన్స్ ను మూడు నెలలపాటు వాయిదా వేయాలని, పోస్టుల సంఖ్య పెంచాలని, లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానాన్ని తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దీంతోపాటు, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, వర్శిటీలకు వైస్ ఛాన్స్ లర్ లను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు.