: ఉత్తరాదిన జల జగడాలు!... నీటి కోసం ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల వాదులాట
జల జగడాలంటే... మనకు గుర్తొచ్చేది దక్షిణాది రాష్ట్రాలే. మహారాష్ట్ర, కర్ణాటకలతో... గోదావరి, కృష్ణా జలాల కోసం తెలుగు రాష్ట్రాలు నిత్యం యుద్ధం చేస్తూనే ఉన్నాయి. తెలుగు నేల విడిపోయిన తర్వాత ఏపీ, తెలంగాణల మధ్య కూడా జల జగడాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక కర్ణాటక, తమిళనాడుల మధ్య ఏళ్ల తరబడి కొనసాగుతున్న జల వివాదం పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఈ దశలో ఉత్తరాదిన కూడా జల జగడాలు మొదలయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీకి తాగు నీటి సరఫరాకు పొరుగు రాష్ట్రం హర్యానా ససేమిరా అంటోంది. మొన్నటి జాట్ల ఆందోళన సందర్భంగా పురుడు పోసుకున్న ఈ వివాదం ప్రస్తుతం తారస్థాయికి చేరింది. తాగు నీటి అవసరాలకు తాము ఏర్పాటు చేసుకున్న కాలువలు కాకుండా ఢిల్లీ సర్కారు వేరుగా కాలువలు తవ్వుకోవాలని హర్యానా వాదిస్తోంది. ఈ వ్యవహారంలో హర్యానా సర్కారు న్యాయస్థానాల ఆదేశాలను కూడా తుంగలో తొక్కేసింది. రానున్న కాలంలో ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదం మరింత ముదిరే అవకాశాలు లేకపోలేదు.