: చదువుకుని వస్తే... చర్చిద్దాం!: రోజా సస్పెన్షన్ పై కోర్టు తీర్పు కాపీలు పంచిన యనమల
టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీలో సభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కొద్దిసేపటి క్రితం సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘చదువుకుని రండి... తర్వాత చర్చిద్దాం’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అధికార పార్టీ సభ్యులు ఆసక్తిగా విన్నారు. అంతేకాకుండా ఆయన పంపిణీ చేసిన కోర్టు తీర్పు కాపీలను జాగ్రత్తగా అందుకున్నారు. వైసీపీ సభ్యురాలు ఆర్కే రోజాపై విధించిన ఏడాది సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు నిన్న మధ్యంతర తీర్పు ఇచ్చింది. దీంతో నేటి సమావేశాలకు హాజరయ్యేందుకు రోజా అసెంబ్లీకి వచ్చారు. అయితే ఆమెను సభ లోపలికి అనుమతించేందుకు స్పీకర్ అంగీకరించలేదు. ఆయన ఆదేశాల మేర మార్షల్స్ ఆమెను అసెంబ్లీలోకి రానీయలేదు. ఆ తర్వాత సమావేశమైన సభలో యనమల మాట్లాడుతూ రోజా సస్పెన్షన్ కు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పును చదువుకుని వస్తే, సోమవారం దానిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని చెప్పారు. అంతకు ముందే ఆయన కోర్టు తీర్పు కాపీలను సభ్యులందరికీ పంపిణీ చేశారు.