: మళ్లీ కోర్టు మెట్లెక్కిన రోజా సస్పెన్షన్ వ్యవహారం... అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ పై సోమవారం విచారణ
నిండు సభలో సభా నాయకుడు నారా చంద్రబాబునాయుడు, సభాధ్యక్షుడు కోడెల శివప్రసాద్ లపై అనుచిత వ్యాఖ్యల ఫలితంగా ఏడాది పాటు సస్పెన్షన్ కు గురైన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యవహారం మరోమారు కోర్టు మెట్లెక్కింది. తనపై విధించిన సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధమని, దానిని ఎత్తివేయాలని తొలుత తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో తక్షణ విచారణ చేపట్టిన హైకోర్టు రోజాపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ జడ్జీ ఇచ్చిన సదరు తీర్పుపై అసెంబ్లీ సెక్రటేరియట్ కూడా వేగంగానే స్పందించింది. సింగిల్ జడ్జి తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు రిజిస్ట్రీ పేర్కొంది.