: తగ్గని స్పీకర్... గవర్నర్ వద్దకు 'రోజా పంచాయతీ'!
వైకాపా ఎమ్మెల్యే రోజాను తిరిగి అసెంబ్లీలోకి వెళ్లే విషయంలో నెలకొన్న వివాదం రాజ్ భవన్ గడపకు చేరనుంది. రోజాను అసెంబ్లీలోకి రానివ్వద్దని స్పీకర్ నిర్ణయించడంతో, ఈ విషయంలో గవర్నర్ ను కలసి ఫిర్యాదు చేయనున్నట్టు వైకాపా స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తుల కన్నా, స్పీకరే ఉన్నత స్థాయిలో ఉన్నారని చెబుతూ, కోర్టు ఆదేశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కోడెల కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని మార్షల్స్ చెబుతున్నారని వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని మీడియాకు తెలిపారు. తాము ఇప్పటికే అసెంబ్లీలో గంటకు పైగా ధర్నా చేశామని, కాసేపట్లో గవర్నర్ వద్దకు బయలుదేరుతామని వివరించారు. ఏపీ అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని ఆరోపించారు.