: చచ్చి బతికినట్లయింది... నాకు ఇది పునర్జన్మే: సీనియర్ సినీ గాయకుడు ఆనంద్
గుండె కవాటంలో సమస్యలతో బైపాస్ సర్జరీ చేయించుకుని డిశ్చార్జ్ అయిన ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు, సంగీత దర్శకుడు జి.ఆనంద్ తన సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు. నిన్నమొన్నటి దాకా ఆరోగ్యంగా తిరుగుతున్న తాను, అకస్మాత్తుగా గుండె సమస్యలకు లోనయ్యానని తెలిపారు. తనకు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడుగుతున్న వారితో మాట్లాడలేని స్థితిలో ఉన్నానని తెలిపిన ఆయన, తనకిది పునర్జన్మని అభివర్ణించారు. చనిపోయి తిరిగి బతికొచ్చినట్లుందని, తన కోసం ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలని తెలిపారు. కాగా, ఈ నెల ఆరంభంలో అస్వస్థతకు గురైన ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా, గుండె కవాటాల్లో సమస్యలు ఉన్నట్టు తేలింది. దీంతో, 8వ తేదీన చెన్నై ఫోర్టిస్ మలర్ ఆసుపత్రిలో ఆయనకు సర్జరీ చేశారు. ఆనంద్ ను పరామర్శించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. కాగా, డబ్బయ్యవ దశకంలో గాయకుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆనంద్ 'దిక్కులు చూడకు రామయ్య పక్కన ఉన్నది సీతమ్మ', 'ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక...' వంటి పలు పాటలతో ఎంతగానో పాప్యులర్ అయ్యారు.