: విశాఖ అద్భుతమైన నగరం...దీనిని మీ నివాసంగా చేసుకోండి: సిస్కో ఛైర్మన్ కు చంద్రబాబు సూచన
విశాఖపట్టణం ఎంతో సుందరమైన నగరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విశాఖపట్టణంలో ఏర్పాటు చేసిన ఫైబర్ గ్రిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, విశాఖపట్టణంలాంటి సుందర నగరాన్ని భారతదేశంలో చూడలేమని అన్నారు. అందుకే ఈ నగరంలో ఓ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలని సిస్కో ఛైర్మన్ జాన్ టి ఛాంబర్స్ కు చంద్రబాబు సూచించారు. ఇక్కడి ప్రజలు ఎంతో సానుకూలంగా, స్నేహంగా ఉంటారని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టును నిర్ణీతకాలంలో పూర్తి చేస్తే దాని ప్రగతిని చూసి వివిధ రాష్ట్రాలు అవకాశం ఇచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అందుకే దీనిని మరో నివాసంగా భావించాలని, ప్రతి ఏడాది వచ్చి, ఇక్కడి పనులను సమీక్షించుకోవచ్చని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సాంకేతిక సామర్థ్యానికి పుట్టినిల్లని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ లోటుతో ప్రారంభమైన తమ రాష్ట్రంలో ఏడాదిలో మిగులు విద్యుత్ సాధించామని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేసుకోవడం ఆంధ్రప్రదేశ్ తోనే ప్రారంభమైందని, వీధి దీపాలను ఎల్ఈడీలుగా మార్చి విద్యుత్ ను ఆదా చేసుకుంటున్నామని ఆయన చెప్పారు. అలాగే వివిధ రంగాల్లో ప్రగతిని సాధిస్తున్నామని ఆయన తెలిపారు. ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు ద్వారా దేశంలోనే పూర్తి స్థాయి డిజిటల్ స్టేట్ గా ఏపీ అవతరించనుందని ఆయన పేర్కొన్నారు. జూన్ చివరి నాటికి విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఫైబర్ గ్రిడ్ పనులు పూర్తికానున్నాయని ఆయన చెప్పారు. ఉత్తరాంధ్రలో ప్రయోగాత్మకంగా తొట్టతొలి సాంకేతిక విప్లవానికి పునాది వేయనున్నామని ఆయన తెలిపారు.