: బీహార్‌లో మందుబాబులకు గడ్డుకాలం.. బహిరంగంగా మద్యం సేవిస్తే పదేళ్ల జైలు
మద్యంకు చోటు లేని రాష్ట్రంగా బీహార్‌ను తీర్చిదిద్దేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకునే దిశగా అడుగులేస్తోంది. ఈ క్రమంలో బహిరంగ మద్యపానాన్ని నిషేధించే అంశంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఆధ్వర్యంలో ఆ రాష్ట్ర మంత్రి వర్గం చర్చించి, కొత్త ఎక్సైజ్ పాలసీని ఆమోదించింది. బహిరంగ మద్యపానం నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనుంది. అంతేగాక వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా ఎక్సైజ్ పాలసీని ఆమోదించింది. తాజాగా మంత్రివర్గం ఆమోదం పొందిన కొత్త ఎక్సైజ్ పాలసీని త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టంగా చేయనున్నారు. బహిరంగ మద్యపాన నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష విధించడమే కాకుండా, మరో పక్క అక్రమంగా మద్యాన్ని విక్రయించే వారిపై 5 లక్షల జరిమానా విధించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చే అవకాశముంది. గత బీహార్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్యనిషేధంపై నితీశ్‌కుమార్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.