: విశాఖలో ప్రతిష్ఠాత్మక ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రారంభించిన చంద్రబాబు


సమాచార, సాంకేతిక రంగంలో విప్లవాత్మక ముందడుగుగా భావించే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశాఖలో ఏర్పాటు చేసిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే అతితక్కువ ధరకే కేబుల్, ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఐదు గ్రిడ్ లలో ఫైబర్ గ్రిడ్ ఒకటని సీఎం తెలిపారు. దీనిని ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రారంభించాలని భావించినట్టు ఆయన వెల్లడించారు. ఏయూలోని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రాంగణంలో ఏపీ ఫైబర్ గ్రిడ్ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రజలతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. దీని ద్వారా రాష్ట్రంలోని కోటీ 30 లక్షల నివాసాలకు ఇంటర్నెట్ సౌకర్యం అందనుందని ఆయన చెప్పారు. రానున్న నాలుగు నెలల్లో 13 వేల కిలోమీటర్ల ఫైబర్ గ్రిడ్ పనులు పూర్తికానున్నాయని అన్నారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా అన్ని జిల్లాలతో కనెక్టివిటీ పెరుగుతుందని ఆయన చెప్పారు. ఫైబర్ కేబుళ్ల కోసం 3.75 లక్షల విద్యుత్ స్తంభాలను వినియోగించుకోనున్నట్టు తెలిపారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా 1.1 కోట్ల ఇళ్లు, 50 వేల పాఠశాలలు, 6 వేల పీహెచ్ సీలు, 10 వేల టెలికాం టవర్లు, 10 వేల ప్రభుత్వ కార్యాలయాలను అనుసంధానం చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. కేవలం 149 రూపాయలకే ఇంటర్నెట్, కేబుల్, టెలిఫోన్ సౌకర్యం అందజేయనున్నట్టు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనగా, ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్పరెన్స్ ద్వారా వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలతో నేరుగా సంభాషించారు.

  • Loading...

More Telugu News