: నాకు న్యాయవ్యవస్థపై గౌరవం మరింత పెరిగింది: ఎమ్మెల్యే రోజా
న్యాయవ్యవస్థపై తనకు ఉన్న గౌరవం రెట్టింపయిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. తనపై విధించిన ఏడాది సస్పెన్షన్ తీర్మానాన్ని ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల కాపీని అసెంబ్లీ సెక్రటరీకి అందజేసిన అనంతరం ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు. హైకోర్టు ఉత్తర్వుల కాపీని అసెంబ్లీ సెక్రటరీకి అందజేశానని, తాను కాపీ అందజేసినట్టు ఆయన సంతకం చేసి కూడా ఇచ్చారని ఆమె చెప్పారు. ఈ కేసులో ఏమి జరుగుతోందో అంతా కోర్టుకు తెలుసునని, న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, కచ్చితంగా తనకు న్యాయం జరుగుతుందని అన్నారు. దీనిపై ప్రభుత్వం మళ్లీ అప్పీలు చేసుకుంటే న్యాయపరంగా పోరాడతానని చెప్పారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును అధికారపక్షం వక్రీకరించి మాట్లాడితే కోర్టే చూసుకుంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీకి వెళతానని, జీరో అవర్ లో తనకు మాట్లాడే అవకాశమివ్వాలని కోరతానని రోజా అన్నారు.