: నొప్పించక... తానొవ్వక!: కోర్టులో ఏపీ సర్కారు వ్యూహం


వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు సంబంధించిన వివాదంపై కోర్టులో వ్యవహరించాల్సిన వ్యూహాన్ని చంద్రబాబునాయుడి ప్రభుత్వం దాదాపుగా ఖరారు చేసుకుంది. రోజాపై విధించిన ఏడాది సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు నేటి ఉదయం కీలక తీర్పు చెప్పింది. తాము విధించిన సస్పెన్షన్ ను రద్దు చేయించుకునేందుకు రోజా కోర్టులను ఆశ్రయించగా, రోజాను అడ్డుకునేందుకు తాము కూడా కోర్టులనే ఆశ్రయించాలని ప్రభుత్వం కూడా కొద్దిసేపటి క్రితం నిర్ణయించుకుంది. అయితే కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కోర్టునే ఆశ్రయిస్తున్న నేపథ్యంలో వ్యవహరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూనే... శాసనసభ తీసుకునే నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించజాలవన్న విషయాన్ని న్యాయమూర్తుల ముందుంచాలని నిర్ణయించింది. ఈ క్రమంలో న్యాయవ్యవస్థను గౌరవిస్తూనే, ప్రభుత్వ వాదనను కాస్తంత సుతిమెత్తగా వినిపించాలని లాయర్లకు సూచించనుంది. వెరసి ‘‘నొప్పించక... తానొవ్వక’’ అన్న చందాన కోర్టులో వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News