: వేటుపై వెనకడుగు లేదు!... మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్న చంద్రబాబు సర్కారు


వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై విధించిన సస్పెన్షన్ వేటుపై వెనకడుగు వేసేందుకు నారా చంద్రబాబునాయుడి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ససేమిరా అంటోందట. రోజాపై సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ నేటి ఉదయం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన మరుక్షణమే శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు రంగంలోకి దిగిపోయారు. సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద్ లతో ఆయన విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రోజాపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయడానికి వీలు లేని విధంగా చర్యలు చేపట్టాలని ఈ చర్చల్లో ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఎలా ఎదుర్కోవాలా? అన్న అంశంపై మూడు ప్రతిపాదనలు వారి చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. వీటిలో సాయంత్రంలోగా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ కు వెళ్లాలనేది తొలి ప్రత్యామ్నాయం. ఇక హైకోర్టు తీర్పును శాసనసభ గౌరవించాల్సిన అవసరం లేదన్న వాదన దిశగా అడుగులేయడమనేది రెండోది. మూడో ప్రతిపాదనగా కీలక అంశం చర్చకు వచ్చింది. ప్రస్తుతం రోజా సస్పెన్షన్ వ్యవహారం ప్రివిలేజ్ కమిటీ విచారణలో ఉన్న నేపథ్యంలో... రోజాపై మరోమారు సస్పెన్షన్ వేటు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఈ మూడింటిలో దేనినో ఒకదానికి అనుసరించి ముందుకెళ్లాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయం తీసుకుంది. దీంతో మరికాసేపట్లో మరో సంచలనానికి తెర లేస్తుందా? అన్న కోణంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

  • Loading...

More Telugu News