: ఈ విజయం నాది మాత్రమే కాదు, నా నియోజకవర్గ ప్రజలది కూడా!: ఎమ్మెల్యే రోజా
ఈ విజయం తనది మాత్రమే కాదని, తన నియోజకవర్గ ప్రజలది కూడా అని ఎమ్మెల్యే రోజా అన్నారు. హైకోర్టులో ఊరట లభించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తన నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరిగిందని, అందుకు తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ‘నా నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయాలంటే నేను అసెంబ్లీలో ఉండాలి కాబట్టి, నేను అసెంబ్లీకి వెళ్లేందుకు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా హైకోర్టు నాకు అవకాశం కల్పించింది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. న్యాయస్థానానికి కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు న్యాయస్థానాలు కచ్చితంగా కల్పించుకుని న్యాయం చేస్తాయన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఈరోజు నాకు న్యాయం జరిగినందుకు సంతోషిస్తున్నాను. న్యాయస్థానాలపై నాకున్న నమ్మకాన్ని రెట్టింపు చేసుకున్నాను. ప్రజల సమస్యలపై సర్కారును ఎప్పుడూ గట్టిగా నిలదీస్తాను. సమస్యలపై పోరాటం ఆపేది లేదు’ అని రోజా పేర్కొన్నారు.