: యనమల చేసిన చిన్న పొరపాటే... రోజాకు వరంగా మారింది!


వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ పై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు కొద్దిసేపటి క్రితం సంచలన తీర్పు వెలువరించింది. రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేస్తూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. అంతేకాక సదరు సస్పెన్షన్ ను ఎత్తివేస్తున్నట్లు కూడా కోర్టు ప్రకటించింది. నిన్న హైకోర్టులో జరిగిన వాదనల సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ రూల్స్ లోని సెక్షన్ 340 ప్రకారం రోజాపై స్పీకర్ ఏడాది పాటు సస్పెన్షన్ వేశారు. అయితే సదరు సెక్షన్ కింద కేవలం ఒక సెషన్ కు మాత్రమే సస్పెన్షన్ పరిమితం అవుతుంది. అయితే సదరు విషయాన్ని అంతగా పట్టించుకోని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సెక్షన్ 340 కిందనే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయాలని తీర్మానాన్ని ప్రతిపాదించారు. దీనిపై స్పీకర్ కూడా ఏమాత్రం ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తొలుత హైకోర్టును ఆశ్రయించిన రోజా, అక్కడ వాదోపవాదాలు పూర్తి కాకుండానే సుప్రీంకోర్టు గడప తొక్కారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో హైకోర్టు వేగంగా స్పందించింది. నిన్న రోజా, ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనల సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. సెక్షన్ 340 ప్రకారం సస్పెండ్ చేసి... ఆ తర్వాత సెక్షన్ ను మారుస్తామంటే, ఎలా కుదురుతుందని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. అంతేకాక ప్రభుత్వ న్యాయవాది వాదనను న్యాయమూర్తి పెద్దగా పట్టించుకోకుండానే వాదనలు ముగిసినట్లు ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం కోర్టు ప్రొసీడింగ్స్ ప్రారంభం కాగానే, రోజాపై సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ న్యాయమూర్తి సంచలన తీర్పు చెప్పారు. ఇక ఈ కేసులో తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. ఆ వాదనల సందర్భంగా మరోమారు ఇరు వర్గాల వాదనలను వింటామని చెప్పారు. అప్పటిదాకా సస్పెన్షన్ ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.

  • Loading...

More Telugu News