: కిడ్నాపర్ల ఘాతుకం... అట్టపెట్టెలో టెన్త్ విద్యార్థి డెడ్ బాడీ!... సికింద్రాబాదులో కలకలం
నిత్యం జనంతో రద్దీగా ఉండే సికింద్రాబాదు అల్ఫా కేఫ్ సమీపంలో నిన్న రాత్రి పెను కలకలం రేగింది. అక్కడ కనిపించిన ఓ అట్టపెట్టెను తెరచిన స్థానికులకు అందులో ఓ పిల్లాడి మృతదేహం కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు అట్టపెట్టెలో విగత జీవిగా ఉన్న ముక్కుపచ్చలారని చిన్నారిని పదో తరగతి చదువుతున్న అభయ్(15) గా గుర్తించారు. పాతబస్తీలోని షాహినాయత్ గంజ్ కు చెందిన అభయ్ నిన్న మధ్యాహ్నం కిడ్నాప్ అయ్యాడు. దీనిపై అభయ్ తల్లిదండ్రులు నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అభయ్ కోసం గాలింపు జరుపుతున్న క్రమంలోనే రాత్రి 11 గంటల సమయంలో అభయ్ తల్లిదండ్రులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. రూ.10 కోట్లు ఇస్తేనే అభయ్ ను విడిచిపెడతామంటూ అవతలి వైపు నుంచి వినిపించిన కిడ్నాపర్ డిమాండ్ కు అభయ్ తండ్రి ససేమిరా అన్నారట. అంతే, ఏమాత్రం ఆలోచించకుండా అభయ్ ను చంపేసిన కిడ్నాపర్లు, అతడి డెడ్ బాడీని అట్టపెట్టెలో పెట్టేసి, సదరు పెట్టెను అల్ఫా కేఫ్ వద్ద వదిలి వెళ్లారు.