: బైక్ పై నుంచి కింద పడ్డ మాజీ ఎంపీ!... కోమాలోకి వెళ్లి తుది శ్వాస విడిచిన వైనం
తెలంగాణకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు రుమాండ్ల రామచంద్రయ్య నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. టీడీపీలో సీనియర్ నేతగా కొనసాగిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలో రాజ్యసభ సభ్యుడిగానూ కొనసాగారు. గతంలో టీడీపీ కేబినెట్ లో పనిచేసిన రుమాండ్ల... ఆప్కో చైర్మన్ గానూ విధులు నిర్వర్తించారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా టీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఆయన టీఆర్ఎస్ కు కూడా రాజీనామా చేశారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రుమాండ్ల ప్రస్తుతం హైదరాబాదులో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఈ నెల 10న సికింద్రాబాదు వెళ్లే క్రమంలో బైక్ పై వెళుతున్న ఆయన సచివాలయం సమీపంలోని తెలుగు తల్లి ఫ్లై ఓవర్ కింద ప్రమాదానికి గురయ్యారు. బైక్ పై నుంచి ఆయన కింద పడ్డారు. ఈ క్రమంలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెనువెంటనే అక్కడికి సమీపంలోని మెడిసిటీ ఆసుపత్రిలో ఆయనను చేర్చారు. గాయాల కారణంగా ఆయన మెదడులో రక్తం గడ్డ కట్టుకుని పోగా, రుమాండ్ల కోమాలోకి వెళ్లిపోయారు. చికత్సకు కూడా ఆయన స్పందించలేదు. ఈ క్రమంలో నిన్న రాత్రి 7 గంటల సమయంలో ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. రుమాండ్ల మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు.