: కాంగ్రెస్ 'కోటి సంతకాల' లిస్టులో తొలి, చివరి సంతకాలు ఎవరెవరివంటే...!


రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న నవ్యాంధ్రప్రదేశ్... త్వరితగతిన కోలుకోవాలంటే ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ తప్పనిసరి అన్న వాదన అన్ని పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది. ఈ వాదనను కేంద్రానికి చెవులు చిల్లులు పడేలా వినిపించే బాధ్యతను మాత్రం కాంగ్రెస్ పార్టీ నెత్తికెత్తుకుంది. ఈ క్రమంలో ఏపీసీసీ చీఫ్ హోదాలో మట్టి సత్యాగ్రహం ప్రారంభించిన రఘువీరారెడ్డి... ఏపీలోని 13 జిల్లాల నుంచి మట్టి, నీరు సేకరించి ఢిల్లీకి తరలించారు. పనిలో పనిగా కోటి సంతకాల సేకరణనను కూడా ఆయన చేపట్టారు. ఈ కోటి సంతకాల్లో మొదటి, చివరి సంతకాలు చేసిన వ్యక్తులు ఎవరన్న విషయం ఆసక్తి కలిగించేదే. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రారంభమైన కోటి సంతకాల సేకరణలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి తొలి సంతకం చేశారు. చాలా రోజుల తర్వాత సదరు సంతకాల్లో నిన్న చివరి సంతకం కూడా చేరిపోయింది. ఆ సంతకం ఎవరిదో తెలుసా?... కాంగ్రెస్ పార్టీ యువరాజుగా వెలుగొందుతున్న ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కోటి సంతకాల జాబితాలో చివరి సంతకం చేశారు. నిన్న ఏపీసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా తొలి సంతకం చేసిన చిరంజీవి... స్వయంగా ఆ కాగితాలను పట్టుకుని రాహుల్ గాంధీ వద్దకెళ్లి చివరి సంతకం చేయించారు.

  • Loading...

More Telugu News