: ఫ్లిప్ కార్ట్, అమేజాన్ కంట్లో 'ఇసుక' కొట్టిన హైదరాబాదీలు!
హైదరాబాద్ కు చెందిన యాహియా మొహమ్మద్ ఇషాక్, అతని బావ మొహమ్మద్ షారోజ్ అన్సారీ... గడచిన నాలుగు నెలలుగా ఈ-కామర్స్ వెబ్ సైట్లు అమేజాన్, ఫ్లిప్ కార్డ్ నుంచి భారీగా ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఆర్డర్ ఇచ్చారు. కానీ ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే వాటిని సొంతం చేసుకున్నారు. అందుకు వారు వాడుకున్నది ఏంటో తెలుసా?... ఇసుక! ఇసుకను ఉపయోగించి వారు చేస్తున్న ఆగడాలకు చెక్ పెట్టారు పోలీసులు. వీరు అప్పటికే ల్యాప్ టాప్, డీవీడీ ప్లేయర్, కెమెరా, సెల్ ఫోన్ తదితర ఎన్నో వస్తువులను కొనుగోలు చేశారు. వీరి దందాపై మరిన్ని వివరాల్లోకి వెళితే, ముందుగా ఈకామర్స్ సైట్ల నుంచి ఓ వస్తువును ఆర్డర్ ఇచ్చేవారు. డెలివరీ బాయ్ రాగానే... "డెబిట్ కార్డును తీసుకువస్తా" నని చెబుతూ, యాహియా ఆ ప్యాకెట్ ను లోనికి తీసుకువెళ్లేవాడు. ప్యాకింగ్, రీ ప్యాకింగ్ తదితరాల్లో అపార అనుభవమున్న ఇషాక్... దాన్ని తెరచి వస్తువును తీసుకుని అంతే బరువున్న ఇసుకను నింపేవాడు. నిమిషాల్లో ఆ ప్యాకెట్ ను తిరిగి యథావిధిగా ప్యాక్ చేసేవాడు. ఆపై డెబిట్ కార్డును తీసుకువచ్చేవాడు. ఆ కార్డు 'నో బ్యాలెన్స్' అని చూపేది. ఆ వెంటనే క్షమాపణలు చెప్పి, కార్డులో బ్యాలెన్స్ లేదని, మరోసారి ఆర్డర్ పెట్టుకుంటానని చెబుతూ, రీ ప్యాక్ చేసిన బాక్స్ ను డెలివరీ బాయ్ కి తిరిగి ఇచ్చేవారు. అమేజాన్ బుక్స్ కు ఇషాక్ ఆన్ లైన్ డీలర్ గా రిజిస్టరై ఉండటం అతని నేరాలకు కలిసి వచ్చిందని, పలు ఖరీదైన వస్తువులను ఆర్డర్ ఇస్తున్నా, 'క్యాష్ ఆన్ డెలివరీ' కింద పంపడాన్ని అలుసుగా తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. వీరిద్దరినీ అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.