: నన్ను కాదన్నారో... విధ్వంసమే: రిపబ్లికన్ పార్టీని హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడేందుకు పరుగులు పెడుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో విజయం సాధిస్తూ, ముందు నిలిచిన తనను కాదని మరొకరిని పార్టీ నుంచి అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తే, అమెరికాలో గొడవలు చెలరేగి విధ్వంసం జరుగుతుందని హెచ్చరించారు. తాను లక్షలాది మందికి ప్రతినిధినని, వారందరి ఆకాంక్షలకూ అనుగుణంగా నిర్ణయం లేకుంటే, జీవితంలో చూడనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వుంటుందని, చెడు సంఘటనలు జరుగుతాయని సీఎన్ఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. కాగా, పార్టీ తరఫున అభ్యర్థిగా నామినేట్ కావాలంటే మొత్తం 1,237 రిపబ్లికన్ స్థానిక ప్రతినిధుల ఓట్లను గెలుపొందాల్సి వుంటుంది. ఆయనకు ప్రధాన పోటీదారులుగా టెడ్ క్రుజ్, మార్క్ రుబియోలు ఉన్నారు. ఇటీవలి కాలంలో ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపై వివిధ దేశాల దౌత్యాధికారుల నుంచి సాధారణ ప్రజల వరకూ అసంతృప్తిని వ్యక్తం చేస్తుండగా, ఆయనపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న రిపబ్లికన్ ప్రతినిధుల సంఖ్య కూడా పెరుగుతోంది.