: నరేంద్ర మోదీ కోసం 'స్పెషల్ రైలు'ను పెట్టించాడు... ఆపై నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు!


ఎన్నికల్లో ఘనవిజయం సాధించినంత మాత్రాన ప్రజలకు, పార్టీ కార్యకర్తలకూ 'అచ్చే దిన్' (మంచి రోజులు) వచ్చినట్టు కాదు. అందుకు ఉదాహరణే బీజేపీ కార్యకర్త వినోద్ సమారియా. బీజేపీకి సహకరించినందున ఇప్పుడతని ముందు లక్షల రూపాయల భారం మిగలగా, తన ముందున్న మార్గం ఆత్మహత్య చేసుకోవడమేనని వాపోతున్నాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే... సమారియా... ఆగ్రాకు 50 కిలోమీటర్ల దూరంలోని ఫతేపూర్ సిక్రీ జిల్లా బీజేపీ ఇన్ చార్జ్. రెండేళ్ల క్రితం సాధారణ ఎన్నికలకు ముందు లక్నోలో మోదీ పాల్గొనే ర్యాలీకి జన సమీకరణ బాధ్యతలను సమారియాకు అప్పగించారు. ఫతేపూర్ నుంచి లక్నోకు ఓ ప్రత్యేక రైలును ఏర్పాటు చేయాలని పార్టీ పెద్దలు సూచించారు. తనకు అప్పగించిన అవకాశాలను మహద్భాగ్యంగా తీసుకున్న సమారియా, 19 బోగీలున్న రైల్ ను ఏర్పాటు చేయించి కార్యకర్తలను తరలించాడు. మార్చి 1న లక్నో చేరిన రైలు, తిరిగి రెండు రోజుల తరువాత ఫతేపూర్ చేరుకుంది. ఆపై 11వ తేదీన సమారియాకు షాకిచ్చింది రైల్వే శాఖ. తమకు రావాల్సిన మిగిలిన రూ. 12 లక్షలను తక్షణం చెల్లించాలన్నదే దాని సారాంశం. రైల్వే రికార్డుల ప్రకారం, బుకింగ్ ఆయన పేరిట ఉండటమే ఇందుకు కారణం. ఇక అప్పటి నుంచి ఆయనకు నిద్రలేని రాత్రులు మొదలయ్యాయి. "రాష్ట్ర పార్టీ నేతలందరితో మాట్లాడాను. ప్రతి ఒక్కరూ నీకేం ఫర్వాలేదులే అని చెప్పేవారే తప్ప సాయం మాత్రం అందడం లేదు. అయితే, వ్యవహారం నాకు, రైల్వేలకూ సంబంధించినది కదా. మా ప్రాంతంలో రైతులు తీసుకున్న రుణాలను చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నాముందున్న మార్గం కూడా అదే" అని వాపోయాడు. గత రెండేళ్లలో ఎన్నోమార్లు రైల్వే శాఖ నుంచి సమారియాకు నోటీసులు అందాయి. పార్టీకి ఎన్నిమార్లు లేఖ రాసినా ఎటువంటి సాయమూ అందలేదు. ఈ విషయంలో బీజేపీ ఉత్తరప్రదేశ్ విభాగం అధ్యక్షుడు లక్ష్మీకాంత్ వాజ్ పేయి స్పందిస్తూ, ప్రత్యేక రైలు విషయంలో కొంత వివాదం ఉందని, అయితే, మొత్తం చెల్లించాల్సిన డబ్బు చెల్లించేందుకు కట్టుబడి వున్నామని తెలిపారు. బీజేపీ పెద్దలు ఆ డబ్బును ఎప్పుడు చెల్లిస్తారోగానీ, అప్పటిదాకా సమారియా నిద్రలేని రాత్రులు గడపక తప్పదేమో!

  • Loading...

More Telugu News