: సుడి‘గేల్’ ఇన్నింగ్స్!... 47 బంతుల్లోనే ‘శతకం’ బాదిన విండీస్ సంచలనం!


ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో రికార్డుల మోత ప్రారంభమైంది. వెస్టిండీస్ సంచలనం క్రిస్ గేల్ ఈ రికార్డుల మోతకు తెర తీశాడు. నిన్న ఇంగ్లండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చెలరేగిపోయిన గేల్... కేవలం 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ‘పొట్టి ప్రపంచ కప్’లో ఫాస్టెస్ట్ సెంచరీని తన పేరిట లిఖించుకున్నాడు. అంతేకాకుండా గేల్ వీర బాదుడు ఓవరాల్ గా మూడో వేగవంతమైన సెంచరీగా రికార్డులకెక్కింది. ముంబై వేదికగా జరిగిన గ్రూప్-1 లీగ్ మ్యాచ్ లో వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు తలపడగా... తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆ తర్వాత 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కరీబియన్లు... గేల్ సుడిగాలి ఇన్నింగ్స్ కారణంగా ఇంకో 11 బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లండ్ జట్టుపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించారు. ఓపెనర్ గా వచ్చిన గేల్ చివరిదాకా క్రీజులో కొనసాగాడు. 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న అతడు మరో బంతిని ఆడి అదనపు పరుగులేమీ చేయలేదు. ఓ వైపు మరో ఓపెనర్ చార్లెస్ (0) ఇన్నింగ్స్ రెండో బంతికే వెనుదిరిగినా, గేల్ ఏమాత్రం తడబడలేదు. తనదైన రీతిలో భారీ షాట్లతో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మొత్తం 48 బంతుల్లో 11 సిక్స్ లు, 5 ఫోర్లతో అతడు సెంచరీ సాధించాడు. గేల్ వీర విహారంతో విండీస్ జట్టు మెగా టోర్నీలో రికార్డు విజయంతో శుభారంభం చేసింది.

  • Loading...

More Telugu News