: చెప్పింది చేసి చూపనున్న చంద్రబాబు... నేటి నుంచి ఉత్తరాంధ్రలో ఫైబర్ గ్రిడ్!
కేవలం రూ. 149 చెల్లింపుతో ఇంట్లో హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ తో పాటు టెలిఫోన్, కేబుల్ సౌకర్యాలను సొంతం చేసే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అంకితం చేయనున్నారు. నేడు విశాఖపట్నంలో జరిగే సభలో తొలి దశ ఆప్టికల్ ఫైబర్ గ్రిడ్ ను ఆయన ప్రారంభించనున్నారు. ఇందుకోసం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని 279 సబ్ స్టేషన్ల పరిధిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంటింటికీ అంతర్జాల సౌకర్యాన్ని కల్పించాలన్న లక్ష్యంతో పని చేస్తున్న ప్రభుత్వం, శ్రీకాకుళంలో 870 కి.మీ, విజయనగరంలో 1,020 కి.మీ, విశాఖపట్నంలో 1,220 కి.మీ కేబుల్ లైన్లను నిర్మించింది. దశలవారీగా రాష్ట్రమంతటా 23 వేల కి.మీ కేబుల్స్ వేసి అన్ని గ్రామాలనూ ఫైబర్ గ్రిడ్ కిందకు తీసుకురావాలన్న లక్ష్యంతో చంద్రబాబు సర్కారు అడుగులు వేస్తోంది. ఇందుకోసం 2,449 విద్యుత్ సబ్ స్టేషన్లను వాడుకోనున్నారు. ప్రస్తుతం అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో కేబుల్ పనులు చురుకుగా సాగుతున్నాయి. మిగతా జిల్లాల్లో పనులు వివిధ దశల్లో ఉన్నాయి. దీంతో ఫైబర్ గ్రిడ్ సౌకర్యం ప్రజలందరికీ దగ్గర చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, ఆ దిశగా తొలి అడుగును విజయవంతంగా వేసినట్లయింది.