: కోనేరు రాజీనామా వెనుక ఏవైనా కారణాలు ఉన్నాయా..?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాజాగా కోనేరు రాజేంద్ర ప్రసాద్ రాజీనామా చేయడంతోపాటు రాజకీయాల నుంచి శాశ్వతంగా నిష్క్రమించడం వెనుక కారణాలు ఏమై ఉంటాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి కోనేరు రాజేంద్రప్రసాద్ ఎమ్మార్ ప్రాపర్టీస్ స్కామ్ లో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దుబాయికి చెందిన ఎమ్మార్ ఎంజీ ఎఫ్ సంస్థ ఎమ్మార్ హిల్స్ టౌన్ షిప్ ప్రాజెక్ట్ లిమిటెడ్ పేరుతో హైదరాబాద్ లోని మణికొండ ప్రాంతంలో సంపన్నమైన నివాస సముదాయాల ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. 2007-2008 మధ్య కాలంలో ఈ ప్రాజెక్టులోని 134విల్లా ప్లాట్లను రాజకీయ నాయకులు, ప్రముఖులకు విక్రయించారు. కాగా, వీటి విక్రయం, మార్కెటింగ్ వ్యవహారాలను స్టైలిష్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ చూసింది. ఈ సంస్థను తుమ్మల రంగారావు అనే వ్యక్తి కోనేరు రాజేంద్రప్రసాద్ తో కలసి ఏర్పాటు చేశారు. అయితే, మార్కెట్ ధరల కంటే అత్యంత తక్కువ రేట్లకు విక్రయాలు జరిపినట్టు చూపించి ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం కలిగించినట్టు సీబీఐ దర్యాప్తులో బయటపడింది. చదరపు గజం ధర 50వేల రూపాయలు ఉంటే రూ.5వేలకే విక్రయించినట్టు సేల్ డాక్యుమెంట్లలో బయటపడింది. కానీ, స్టైలిష్ హోమ్స్ ప్రైవేటు లిమిటెడ్ మేనేజర్ గా పనిచేసిన కొడాలి శ్రీనివాసరావును సీబీఐ విచారించినప్పుడు కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూశాయి. చదరపు గజానికి కేవలం రూ.5వేలే చెల్లించినట్టు రికార్డులో చూపినప్పటికీ... కొనుగోలు దారుల నుంచి చదరపు గజానికి 40 నుంచి 45వేల వరకు నగదు రూపంలో స్టైలిష్ హోమ్స్ వసూలు చేసినట్టు తేలింది. బస్తాల కొద్దీ నగదు సంచులను తాను తీసుకొచ్చి కోనేరు ప్రసాద్, ఆయన కుమారులు ప్రదీప్, మధు, సునీల్ కు అందజేసినట్టు శ్రీనివాసరావు సీబీఐకి తెలిపారు. ఇప్పుడు ఈ కేసు సీబీఐ కోర్టు విచారణలో ఉంది. ఇదే కేసులో కోనేరు గతంలో అరెస్టై ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు.