: ఏచూరి వెర్సస్ జైట్లీ... ఆధార్ బిల్లుపై రాజ్యసభలో రగడ!
ప్రభుత్వం లోక్‌సభలో ఆధార్ బిల్లును ద్రవ్యబిల్లుగా ఆమోదించడంలో ఉద్దేశమేమిటో చెప్పాలని సీపీఎం నేత ఏచూరి ప్రశ్నించారు. ఈ అంశంపై ఏచూరి సంధించిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఇరు నేతల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఐదుగురు సభ్యుల పార్లమెంటు ప్యానెల్.. ఆధార్ బిల్లు వ్యక్తిగత ప్రైవసీని ఉల్లంఘిస్తుందా? అనే విషయాన్ని పరిశీలిస్తున్న నేపథ్యంలో రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించజాలదని ఏచూరి పేర్కొన్నారు. దీనికి జైట్లీ సమాధానమిస్తూ.. 'ప్రైవసీ కచ్చితమైన హక్కు కాదని, ప్రైవసీ అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలిస్తోందని అన్నారు. చట్టంలో రూపొందించిన నిబంధనల ద్వారా దీనికి ఆంక్షలు విధించవచ్చని చెప్పారు. 'మీరు నన్ను విమర్శిస్తే.. భావప్రకటనా స్వేచ్ఛా? అదే నేను మిమ్మల్ని విమర్శిస్తే.. అది నా అసహనమా?' అని జైట్లీ ప్రశ్నించారు. ఆధార్ బిల్లును లోక్‌సభలో ద్రవ్యబిల్లుగా ప్రభుత్వం ఆమోదించింది. లోక్‌సభలో అధికార పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ద్రవ్యబిల్లును రాజ్యసభ చర్చించాల్సి ఉంటుంది. అయితే, ఇక్కడ గమనించదగ్గ అంశం ఏమిటంటే, రాజ్యసభ ద్రవ్యబిల్లును ఒకవేళ నిర్ణీత వ్యవధిలో చర్చించలేకపోయినప్పటికీ అది సభ ఆమోదం పొందినట్టే లెక్క!