: దుర్గగుడిలో సమసిన వివాదం... రాజీ బాటలో ఇరు వర్గాలు!


విజయవాడ ఇంద్రీకీలాద్రిపై ఉన్న దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో అర్చకులు, మాజీ ఈవో నర్సింగరావు మధ్య తలెత్తిన వివాదం సద్దుమణిగింది. ఇటీవల దుర్గగుడి అర్చకులు మూకుమ్మడిగా విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టడంతో ప్రభుత్వం ఈవోగా నర్సింగరావును సెలవుపై పంపించి... గతంలో దుర్గగుడి ఈవోగా పనిచేసి కాకినాడ ఆర్జేసీగా ఉన్న చంద్రశేఖర్ ఆజాద్ కు తాత్కాలిక ఈవోగా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత అర్చకులతో చర్చలు కూడా జరిపారు. నర్సింగరావు కఠిన వ్యవహార శైలి కారణంగా ఓ అర్చకుడు తీవ్ర అస్వస్థతకు లోనై ఆస్పత్రి పాలైన విషయం విదితమే. ఈ ఘటన తర్వాత అర్చకుల నుంచి తిరుగుబాటు ఎదురైంది. ఆస్పత్రిపాలైన అర్చకుడి వైద్యాన్ని ప్రభుత్వమే భరించడంతోపాటు, నర్సింగరావును ఆయన మాతృ విభాగమైన రెవెన్యూ శాఖకు తిరిగి పంపాలని అర్చకులు డిమాండ్ చేశారు. వారు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. దీంతో తాత్కాలిక ఈవోగా ఆజాద్ ను రంగంలోకి దింపిన ప్రభుత్వం... ఆ తర్వాత సంస్కరణ చర్యలు చేపట్టింది. నర్సింగరావుతోపాటు అర్చకులపై కూడా ఉన్నతాధికారులు ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో ఇరు వర్గాలు వివాదాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నర్సింగరావును ఈవోగా యథావిధిగా కొనసాగించినప్పటికీ తమకు అభ్యంతరం లేదని అర్చకులు కొత్త పల్లవి అందుకున్నారు. ఇదే విషయాన్ని అర్చకుల సంఘం ప్రతినిధులు ఉన్నథికారులను కలసి నివేదించనున్నారని సమాచారం. వాస్తవానికి నర్సింగరావు ఈ నెల 30 వరకు సెలవులో ఉన్నారు. దీంతో ఈవోగా ఆయనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News