: గుమ్నామీ బాబా బాక్స్‌లో నేతాజీ కుటుంబ సభ్యుల ఫొటోలు... కొత్త సందేహాలు!
నేతాజీ సుభాష్ చంద్రబోస్‌గా చాలా మంది భావిస్తున్న గుమ్నామీ బాబా ఇంట్లోని ఓ బాక్స్‌లోని కొన్ని ఫోటోలు తాజాగా బయటపడ్డాయి. ఉత్తరప్రదేశ్ ఫైజాబాద్‌లోని ఆయన ఇంట్లో నేతాజీ కుటుంబ సభ్యుల ఫొటోలు దొరికాయి. వాటిల్లో నేతాజీ తల్లిదండ్రులు జానకీనాథ్ బోస్, ప్రభావతి బోస్‌తో పాటు 22 మంది కుటుంబ సభ్యుల ఫొటోలు కూడా ఉన్నాయి. గుమ్నామీ బాబా జీవితంలో 1982 నుంచి 1985 వరకు చివరి మూడేళ్లు అక్కడి రామ్ భవన్‌లో గడిపారు. దీని యజమాని శక్తి సింగ్ ప్రస్తుతం బయటపడిన ఫొటోలను ధ్రువీకరించారు. ఫోటోలతో పాటు నేతాజీ జన్మదినం, దుర్గాపూజ నాడు వచ్చిన పలు టెలిగ్రామ్‌లు కూడా లభించాయి. అవి ఆజాద్ హింద్ ఫౌజు దళం సీనియర్ అధికారులు గుమ్నామి బాబాకు పంపినవిగా గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్ జిల్లాలో గుమ్నామీ బాబా పేరుతో నేతాజీ అజ్ఞాత జీవితం గడిపారని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఆయన జపాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారనే వాదనే బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన బాక్సులో ఈ ఫోటోలు కనిపించడం కొత్త సందేహాలకు తెరలేపింది!