: షేర్వాణీ వేసుకోవాలని రాజ్యాంగం చెప్పిందా?: ఒవైసీపై జావేద్ అక్త‌ర్ ఆగ్ర‌హం


గొంతుపై కత్తి పెట్టి బెదిరించినా ‘భారత్‌ మాతాకీ జై' అన‌బోన‌ని చెప్పిన ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై స్వ‌త‌హాగా క‌వి అయిన రాజ్య‌స‌భ సభ్యుడు జావేద్‌ అక్తర్ ఘాటుగా స్పందించారు. రాజ్య‌స‌భ‌లో ఆరేళ్ల పాటు సేవలందించిన ఆయ‌న వీడ్కోలు ఉపన్యాస‌మిస్తూ.. 'భారత్‌ మాతాకీ జై అని అనను' అన్న మజ్లిస్‌ పార్టీ నేత అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యలపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. భార‌త్ మాతాకీ జై చెప్ప‌న‌ని అన‌డం విస్మ‌యం క‌లిగించే విష‌యం అన్నారు. 'భారత్‌ మాతాకీ జై అనాలని రాజ్యాంగంలో చెప్పలేదన్నావు... మరి షేర్వాణీ వేసుకోవాలని రాజ్యాంగం చెప్పిందా?' అంటూ ఒవైసీ పేరు ప్రస్తావించకుండానే జావేద్‌ అక్తర్‌ ఆయనని ప్రశ్నించారు. లౌకికవాదం, రాజ్యాంగం, యువశక్తి భారత్‌కు ప్రయోజనకర అంశాలని, వీటిని ప్రజలు ఆస్వాదిస్తున్నారని, వాటిని నాశనం చేయకూడదని కోరారు. 'ఓ వ్యక్తి (ఒవైసీ) తనను తాను జాతీయ నాయకుడిగా భావిస్తున్నారు.. కానీ ఆయన హైదరాబాద్‌లో ఓ గల్లీకి మాత్రమే నాయకుడు' అంటూ ఒవైసీపై వ్యంగ్యాస్త్రం సంధించారు. ప్రసంగంలో పలు మార్లు 'భారత్‌ మాతాకీ జై' అని నినదించారు. ఇది తన హక్కు అని స్ప‌ష్టం చేశారు. ఆరేళ్ల పాటు సేవలందించిన 17 మంది ఎంపీలకు ఎగువసభ వీడ్కోలు పలికింది. పదవీకాలం ముగుస్తున్న వారిలో జావేద్‌ అక్తర్ తో పాటు అశ్వనికుమార్, ఎంఎస్‌ గిల్‌, మణిశంకర్‌ అయ్యర్‌ (కాంగ్రెస్‌), అవినాష్‌ రాయ్‌ ఖన్నా (బీజేపీ), కె.బాలగోపాలన్‌, టీఎన్‌ సీమా (సీపీఎం), బాలచంద్‌ ముంగేకర్‌, జైశ్రీ (నామినేటెడ్‌) తదితర ప్రముఖులు ఉన్నారు. మరోసారి ఎన్నికయ్యే అవకాశం లేని వారి సాన్నిహిత్యాన్ని సభ కోల్పోతోందని ఈ సందర్భంగా చైర్మన్‌ అన్సారీ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News