: ఆర్పీఐ తరపున అసోం ఎన్నికల ప్రచార బరిలోకి రాఖీసావంత్
రానున్న అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బాలీవుడ్ నటి రాఖీ సావంత్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అథవాలే) తరపున ప్రచారం చేయనున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ సూత్రాలే ప్రాతిపదికగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) మహారాష్ట్రలో దళితుల హక్కుల కోసం పోరాడుతోన్న విషయం తెలిసిందే. రానున్న అసోం అసెంబ్లీ ఎన్నికల బరిలోకి తొలిసారి దిగుతున్నప్పటికీ తమ పార్టీకి ఐదు సీట్లు దక్కుతాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాఖీ సావంత్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మహిళా విభాగానికి అధినేత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆమె ప్రచార ప్రభావం అక్కడి యంగ్ జనరేషన్పై తప్పక పడుతుందని ఆర్పీఐ స్టేట్ జనరల్ సెక్రటరీ నాథుని దాస్ పేర్కొన్నారు. రాజ్యాంగ హక్కులను గురించి ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ నినాదంగా పోటీలో దిగుతున్నామని తెలిపారు. రాఖీ సావంత్ తో పాటు సింగర్, యాక్టర్ సల్మా ఆగా, యాక్టర్ నానా పటేకర్ కూడా ప్రచారం చేయనున్నారని నాథుని దాస్ వెల్లడించారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసింది. మిగతా అభ్యర్థుల జాబితాను త్వరలోనే ప్రకటిస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి. అసోం అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో ఏప్రిల్ 4, 11న జరగనున్నాయి.