: ఏపీ సర్కారుపై సుప్రీం సీరియస్... రోజా సస్పెన్షన్ కేసు హైకోర్టుకు బదిలీ
ఏపీ అసెంబ్లీ విధించిన తన సస్పెన్షన్ ను తొలగించాలని వైకాపా ఎమ్మెల్యే రోజా వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సీరియస్ అయింది. సస్పెన్షన్ ప్రతులను అందజేయడంలో ఆలస్యం చేయడమేంటని ఆక్షేపించింది. ఈ కేసులో రేపు విచారణ చేపట్టాలని తెలుగు రాష్ట్రాల హైకోర్టును ఆదేశించింది. అంతకుముందు రోజా తరఫు న్యాయవాది తన వాదన వినిపిస్తూ, రూల్ 342/2 ప్రకారం ఆ సెషన్ వరకూ మాత్రమే సభ్యులను సస్పెండ్ చేయవచ్చని కోర్టుకు తెలిపారు. తన క్లయింటును బడ్జెట్ సమావేశాలకు హాజరుకానిచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ కేసు హైకోర్టులోనే పరిష్కారం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. తాము హైకోర్టును ఆశ్రయిస్తే, అసిస్టెంట్ రిజిస్ట్రార్ తిరస్కరించారని సుప్రీంకోర్టుకు రోజా తరఫు న్యాయవాది వివరించగా, ఆయనకు ఆ అధికారం ఎక్కడిదని సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కేసును బుధవారం నాడు విచారించాలని హైకోర్టును ఆదేశించింది. ఈ మేరకు సాయంత్రంలోగా ఈ-మెయిల్ ఆదేశాలు పంపుతామని, రేపు ప్రధాన న్యాయమూర్తి ఈ కేసును స్వయంగా చేపట్టేలా చూస్తామని తెలియజేసింది.