: పాక్ గూఢచర్యానికి సహకరిస్తున్న యాప్ ను డిలీట్ చేసిన గూగుల్!
భారత సైన్యంపై గూఢచర్యం చేసేందుకు పాక్ ఉపయోగిస్తున్న స్పైవేర్ యాప్ 'స్మెష్'ను గూగుల్ తొలగించింది. పాక్ నిఘా వర్గాలు ఈ యాప్ వాడుతూ, సైనిక రహస్యాలు సేకరిస్తున్నారన్న అనుమానాలతో గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని తొలగించినట్టు తెలుస్తోంది. ఈ యాప్ ద్వారా సైనిక దళాలు, ఉగ్రవాద నిరోధక దళాల కదలికలను వారు పసిగడుతున్నట్టు గతంలోనే భారత నిఘా వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ స్పైవేర్ యాప్ ను లోడ్ చేసుకుంటే, మూడో వ్యక్తి సులువుగా ఫోన్లోని సమాచారం, టెక్ట్స్ మెసేజ్ లు, తీసుకున్న ఫోటోలు, ఫోన్ ఏ సెల్ టవర్ పరిధిలో ఉంది... తదితర విషయాలను తెలుసుకోవచ్చు. ఈ యాప్ కు వచ్చే సమాచారాన్ని పాక్ వ్యక్తి జర్మనీలో నిర్వహిస్తున్న సర్వర్ కు చేరుతుంది. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడికి ముందు ఈ యాప్ ను ఉపయోగించుకునే పథకం రూపొందించారని విచారణలో వెల్లడైంది. దీంతో భారత అభ్యంతరాల మేరకు గూగుల్ దీన్ని యాప్ స్టోర్ నుంచి డిలీట్ చేసింది.